తుమ్మల నాగేశ్వరరావు  ఓటమితో మంత్రివర్గంలో కమ్మ సామాజిక వర్గానికి మంత్రి పదవి  ఇస్తే ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కు ఖాయమని భావించారు. ఆయన కూడా కేటీఆర్ తో ఉన్న సన్నిహిత సంబంధాలు, అనుభవం, కుటుంబనేపథ్యం, రాజకీయంగా ఖమ్మం జిల్లా రాజకీయ కోణంలో మంత్రి పదవి ఖాయమని భావించారు. కానీ అనూహ్యంగా సీను మారింది. ఓడిపోయిన వారికి మంత్రి పదవి ఇవ్వమని ముందే కేసీఆర్ చెప్పారు. ఖమ్మం ఎన్నికల సభలో కూడా తెుమ్మలకు పెద్ద పదవి ఇస్తామని.. పరోక్షంగా గవర్నర్ అంటూ సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో పువ్వాడ యువకుడు, భవిష్యత్తు ఉంది.. అంటూ అనడంతో తన పేరు ఖాయమని ఓ నిర్ణయానికి వచ్చారు. కానీ తెరమీదకు మండవ పేరు వచ్చింది. స్వయంగా కేసీఆర్ ఇంటి్కి వెళ్లి పిలిచారు. తన కేబినెట్ లో సీనియర్లు.. అనుభవం ఉన్న నాయకులు ఉండాలని కోరుకుంటున్న కేసీఆర్.. మండవను మంత్రివర్గంలో తీసుకుంటారని తెలుస్తోంది. వాస్తవానికి ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మండలి ఛైర్మన్ చేస్తారని ముందుగా ప్రచారం జరిగినా.. ఆయనకు తన కేబినెట్ లోకి తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారట. తుమ్మల లేకపోవడంతో మంత్రివర్గంలో తన సహచరులు సీనియర్లు ఉంటే మంచిదని భావించి మండవ వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. వాస్తవానికి పువ్వాడ అజయ్ కుమార్ ఇంకా కమ్మ సామాజికవర్గానికి ప్రతినిధిగా గుర్తింపు లేదు. పైగా ఆయన కంటే సీనియర్లు కూడా పార్టీలో ఉన్నారు. మండవ ఆ సామాజి వర్గానికి నాయకుడిగా ఉన్నారు.  ఆ సామాజికవర్గంలో మండవకు రాష్ట్ర వ్యాప్తంగా ముద్ర ఉంది. రాష్ట్రంలో కమ్మ సామాజికవర్గం టిఆర్ఎస్ కు అనుకూలంగా మారిందని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. మొత్తానికి మండవ ఎంట్రీతో ఖమ్మం జిల్లాకు మంత్రిపదవి ఆశలు గల్లంతయ్యాయని పార్టీలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పువ్వాడ అజయ్ కుమార్  ఆశలు నీరుగారిపోతున్నాయి.