కడప స్టీల్ ఫ్లాంట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. కడప జిల్లా, మైలవరం మండలం, కంబాలదిన్నెలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన చేసి.. పైలాన్‌ను ఆవిష్కరించారు. 2700 ఎకరాల్లో, రూ. 18వేల కోట్ల పెట్టుబడితో, మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ స్టీల్ ప్లాంట్‌ను నిర్మించనున్నారు.
కృష్ణపట్నం పోర్టు ద్వారా విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేయనున్నారు. గండికోట రిజర్వాయర్ నుంచి ఫ్యాక్టరీకి నీటి సరఫరా అందించనున్నారు. జమ్మలమడుగు నుంచి 12 కి.మీల మేర రైల్వే లైన్‌‌ను ఏర్పాటు చేయనున్నారు. కడప స్టీల్‌ ఫ్యాక్టరీ సీఎండీగా విశాఖ ఉక్కు నిపుణుడు మధుసూదనరావును ప్రభుత్వం నియమించింది. విభజన చట్టంలో పేర్కొన్నా.. స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి కేంద్రం వెనుకడుకేసింది. మోదీ ప్రభుత్వం సహకరించకపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం జరగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎంపీ సీఎం రమేష్‌, స్థానిక నేతలు, ముఖ్య అధికారులు హాజరయ్యారు.